ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడుదామని సార్క్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. కోవిడ్-19 వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 5 వేల మంది మృతిచెందారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో బలమైన వ్యూహాన్ని రచించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిద్దామని భాగస్వామ్య దేశాధినేతలందరిని ప్రధాని మోదీ కోరారు. మోదీ పిలుపుకు పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో తాము కూడా పాల్గొననున్నట్లు పాక్ ప్రధాని హెల్త్ అసిస్టెంట్ జాఫర్ మీర్జా తెలిపారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పాక్‌లో ప్రచారం జాఫర్ మీర్జా నేతృత్వంలో కొనసాగుతోంది. కోవిడ్-19 వ్యాధితో భారత్‌లో ఇద్దరు మరణించగా పాక్‌లో ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. పాక్‌లో కరోనా కేసులు 28 నమోదయ్యాయి. అదే భారత్ కరోనా కేసుల సంఖ్య 83కు చేరుకుంది.